కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడక మార్గంలో వెళ్లి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నార.. అలిపిరిలో ఉదయం 11:40 గంటల సమయంలో నడక ప్రారంభించి మధ్యాహ్నం 1:30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. కేవలం గంటా 50 నిమిషాల వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్ వాద్రాతో కలసి పోటీపడుతూ నడిచారు.

నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు. జీఎన్‌సీ ప్రాంతం నుంచి నడుస్తూనే అతిథి గృహానికి చేరుకున్నారు. గాలిగోపురం వద్ద సాధారణ భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లను పొందారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు.
తిరుపతిలో ‘భరోసా యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, మోదీ ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలన్నీ అబద్ధమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి మాట తప్పిన మోదీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేసేందుకు మోదీకి మనసు రావట్లేదని, బడా వ్యాపారవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఎద్దేవా చేశారు. ఈరోజున చాలా మంది తామే గొప్ప దేశభక్తులమని చెప్పుకుంటున్నారని, జవాన్లపై దాడి సమయంలో మోదీ తన ప్రచార చిత్రానికి పోజులు ఇచ్చారని విమర్శించారు.

