తెలంగాణలో రాహుల్‌ పర్యటన.. కాంగ్రెస్‌కు భారీ షాక్‌..

89
rahul
- Advertisement -

తెలంగాణలో రాహుల్‌ గాంధి పర్యటనకు ముందు టీ కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. రాహుల్‌ పర్యటన సందర్భంగా అరెస్టు అయిన ఎన్‌ఎస్‌యూఐ నేతలతో రాహుల్‌ గాంధీ ములాకత్ కు ప్లాన్‌ చేశారు టీకాంగ్రెస్‌ నేతలు. ఈ క్రమంలో వారికి గట్టి దెబ్బ తగిలింది. ఎన్‌ఎస్‌యూఐ నేతలతో రాహుల్‌ గాంధీ ములాకత్‌కు చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌ అనుమతిని నిరాకరించారు. అయితే జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూనేతలను కలిసేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు అనుమతి కోరినా.. సూపరింటెండెంట్‌ మాత్రం తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఏం చేయాలో తోచక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాహుల్‌ గాంధీ పర్యటనతో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కాపాడుకుందామని ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ నేతలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇప్పటికే ఓయూలోకి అనుమతించాలంటూ హైకోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్‌ నేతలకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దిమ్మతిరిగింది. మళ్లీ ఇప్పుడు చంచల్ గూడ జైలులోకి రాహుల్‌ గాంధీని అనుమతించకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడినట్లైంది. రాహుల్‌ గాంధీ పర్యటనతో తమ సత్తాను చాటుకోవాలనుకున్న నేతలు ఇప్పుడు తెల్లమొకం వేసుకుని తీవ్ర నిరాశలో ఉన్నారనే చెప్పాలి. అసలే కాంగ్రెస్‌ లో గ్రూపు రాజకీయాలకు తోడు.. నువ్వా నేనా అనే ఆధిప్యత ధోరణితో సతమతమవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు అటు హైకోర్టు కానీ.. ఇటు చంచల్‌ గూడ జైలు అధికారులు కానీ కోలుకోని షాకిచ్చారనే చెప్పాలి. అటు ఓయూలోకి… ఇటు చంచల్ గూడలోకి రాహుల్‌ను అనుమతించకపోవడం.. కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.

తాము ఎంతో ప్రయత్నం చేసినా.. రాహుల్‌ ను అనుకున్న విధంగా ఓయూలోకి కానీ… చంచల్‌ గూడలోకి తీసుకెళ్లలేకపోయామనే భావన కాంగ్రెస్‌ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తాము ఒకటి తలిస్తే… హైకోర్టు.. ఓయూ వీసి మరోకటి తలిచారని.. అందుకే రాహుల్‌ పర్యటన అనుకున్న విధంగా జరగలేకపోయిందన్న భావన కొందరి కాంగ్రెస్‌ నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాహుల్‌ పర్యటన… కాంగ్రెస్‌ నేతల్లో నూతనోత్తేజాన్ని.. నింపుతుందని భావిస్తే… ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు… రాహుల్‌ పర్యటనకు ముందే కాంగ్రెస్‌ నేతలకు గుండెల్లో గునపం దించినట్లుగా… వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగలడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది.

- Advertisement -