ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఇకలేరు..

129
- Advertisement -

భారత వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ (83) మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు పూణెలో ఆయన తుదిశ్వాస విడిచారు. తన కుటుంబసభ్యుల సమక్షంలో ఆయన కన్నుమూశారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. బజాట్ ఆటోమొబైల్స్ సంస్థ ఛైర్మన్ పదవికి గత ఏడాది ఏప్రిల్ లో ఆయన రాజీనామా చేశారు. ఆయన మరణంతో భారత దేశ పారిశ్రామిక, వ్యాపార రంగాలు విషాదంలో మునిగిపోయాయి.

రాహుల్ బజాజ్ 1972లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో ఆయనకు అనుబంధం ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో రాహుల్ బజాజ్ ఒకరు. టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలకు కారణమైన బజాజ్ ఆటో సంస్థ రాహుల్ బజాజ్ సారథ్యంలో అగ్రస్థానికిక వెళ్లింది. రాహుల్ బజాజ్ 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు.

రాహుల్ బజాజ్ జూన్ 10, 1938న జన్మించారు. ఆయన ఎకనామిక్స్ మరియు లాలో డిగ్రీ చేశారు. అనంతరం హోవార్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో పట్టా పొందారు. 1968లో బజాజ్ ఆటోలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేరి సంస్థ ఉన్నతిలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మభూషనణ్ అవార్డుతో సత్కరించింది. గతేడాది ఆయన బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాహుల్ బజాజ్ తర్వాత 76 ఏళ్ల నీరజ్ బజాజ్ బజాజ్ ఆటో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -