సఫారీ క్రికెటర్ రబాడ మరోసారి వార్తల్లో నిలిచారు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా పర్యాటక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 11 వికెట్లు తీసిన రబాడ..ఆ మ్యాచ్‌లో దురుసు ప్రవర్తన కారణంగా రెండు టెస్టుల నిషేధాన్ని ఎదుర్కొగా తాజాగా ఐసీసీ ఆనిషేధాన్ని ఎత్తేసింది.
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కావాలని ఢీకొట్టాడన్న ఆరోపణల నుంచి రబాడా బయటపడ్డాడు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా మాత్రం విధించారు. స్మిత్‌ను కావాలని ఢీకొట్టినట్లుగా తాను భావించడం లేదని, అందుకే అతన్ని వదిలేస్తున్నట్లు జుడీషియల్ కమిషనర్ మైకేల్ హెరాన్ చెప్పారు. మళ్లీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే రబాడాపై చర్యలు తప్పవన్నారు.
మూడో టెస్టు మొదలయ్యేలోపే విచారణ పూర్తి చేసినందుకు సఫారీ జట్టు మేనేజ్ మెంట్ మైకేల్ హెరాన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.