థియేట‌ర్స్ బంద్ వ‌ల్ల సాధించింది ఏంటి..?

296
- Advertisement -

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బంద్ అనేది బ్ర‌హ్మాస్ర్తం లాంటిది. అలాంటి బ్ర‌హ్మాస్త్రాన్ని ఉప‌యోగించి తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు ఏం సాధించారో అర్థం కావ‌డం లేదు. కొండ‌ను త‌వ్వి క‌నీసం ఎలుక‌ను కూడా ప‌ట్ట‌లేదు అంటూ తెలుగు ఫిలింఛాంబ‌ర్‌పై విరుచుకుప‌డ్డారు ఆర్. నారాయ‌ణ‌మూర్తి. డిజిట‌ల్ స‌ర్వీస్ రేట్లు త‌గ్గించాలంటూ సౌతిండియ‌న్ ఫిలిం ఇండ‌స్ర్టీ అంతా ఒక తాటిమీద‌కొచ్చి మార్చి 2వ తేదీ నుండి థియేట‌ర్స్ బంద్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారు, తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం ఈ శుక్ర‌వారం నుండి థియేట‌ర్స్ బంద్ ని విర‌మింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణా ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఈ రోజు ఫిలించాంబ‌ర్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు-నిర్మాత‌-ద‌ర్శ‌కుడు ఆర్.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ…“త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో ఇంకా థియేట‌ర్స్ బంద్ కొన‌సాగుతుంటే మ‌న తెల‌గు ఫిలించాంబ‌ర్ వారు అప్పుడే థియేట‌ర్స్ బంద్ ను ఎందుకు ఆపాల్సి వ‌చ్చింది. ఐదేళ్ల త‌ర్వాత ఫ్రీగా ఇస్తామంటూ డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ ఇచ్చిన హామీలు అమ‌లు కాకముందే ఎందుకు హ‌ఠాత్తుగా బంద్ విర‌మించుకున్నారు. ఈ బంద్ వ‌ల్ల సినీ కార్మికులు ఇబ్బంది ప‌డ్డారు త‌ప్ప ఒరిగిందేమీ లేదు. అయినా నిర్మాత‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో అంద‌రూ స‌హ‌క‌రించారు. అలాగే ప‌బ్లిక్ కూడా ఈ బంద్ కు ఎంతో స‌హ‌క‌రించారు. డిజిటల్ స‌ర్వీస్ చార్జీలు త‌గ్గితే చిత్ర ప‌రిశ్ర‌మకు మంచి జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో మేమంతా సంఘీభావం తెలిపాము. కానీ, ఇలా మీ ప్ర‌యోజ‌నాల‌కోసం, మీ స్వార్థం కోసం బంద్ ని హ‌ఠాత్తుగా ఆపేస్తారా? ఈ బంద్ వ‌ల్ల సాధించింది ఏంటి? దీనికోస‌మైతే సురేష్ బాబు, జెమిని కిర‌ణ్ , అల్లు అర‌వింద్ లాంటి పెద్ద‌లు బంద్ వ‌ర‌కు వెళ్ల‌కుండా ముందే మాట్లాడి సెటిల్ చేస్తే స‌రిపోయేది క‌దా? థియేట‌ర్స్ బంద్ దాకా వెళ్లాల్సిన పనేంటి?

R Narayana Murthy Press Meet

గ‌తంలో డా.రామానాయుడు, దాస‌రి నారాయ‌ణ‌రావుగార్ల‌లాంటి పెద్ద‌లు ప‌దిమంది నిర్మాత‌ల మంచి కోరేవారు త‌ప్ప ఎప్పుడూ తామే బ‌త‌కాల‌నీ, త‌మ స్వార్థాం కోసం ఎప్పుడూ ఆలోచించ‌లేదు. గ‌తంలో కూడా లీజులు, డిజిట‌ల్ సర్వీస్ ప్రొవైడ‌ర్స్ మీద మేము ఎన్నో పోరాటాలు, నిర‌హార దీక్ష‌లు చేశాం కానీ ఐక్య‌త లేక‌పోవ‌డం వ‌ల‌న స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాం. ఇప్పుడు కూడా స‌క్సెస్ కాలేక‌పోయాం. దీనికి కార‌ణం మేజ‌ర్ సెక్టార్ వాళ్ల స‌పోర్ట్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌. కొద్ద మంది ప్ర‌యోజ‌నాలు చూసుకోవ‌డం వ‌ల‌న‌. ఇకనైనా తెలుగు రాష్ర్టాల సినిమాటోగ్ర‌ఫీ మంత్రులు ఈ విష‌యంలో క‌ల‌గ‌జేసుకుని చిన్న చిత్రాల నిర్మాత‌ల‌కు న్యాయం చేయాల‌ని కోరుకుంటున్నా. రెండు వేలు , రెండు వేల ఐదువంద‌ల‌కు మేం డిజిట‌ల్ సర్వీస్ లు ప్రొవైడ్ చేస్తామంటూ నూత‌న కంపెనీలు వ‌స్తున్నా… వారిని ఎందుకు రానీయడం లేదు. కొత్త వారికి అవ‌కాశం ఇస్తే క‌చ్చితంగా క్యూబ్, యుఎఫ్ ఓ వాళ్లు దిగిరాక మానరు. ఈ విష‌యంలో ఇక‌నైనా ప్ర‌భుత్వం జోక్యం చేసుకోని ప్ర‌తి ఒక్క‌రికీ మంచి జ‌రిగేలా చూడాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

తెలంగాణ‌ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ మాట్లాడుతూ…“ప‌దేళ్లుగా డిజిట‌ల్ వ్య‌వ‌స్థ మీద పోరాడుతున్నాం. పెద్ద‌ల సపోర్ట్ లేక మేము స‌క్సెస్ కాలేక‌పోయాం. ఫ్రీగా ఇచ్చే దాకా థియేట‌ర్స్ బంద్ ఆపబోమ‌ని చెప్పి ఇలా రెండు వేల రూపాయ‌లు త‌గ్గించగానే థియేట‌ర్స్ బంద్ ఆపేసారు. ఇది కాదు మేము కోరుకున్న‌ది. మొత్తం ఫ్రీగా ఇవ్వాలి లేదా మీరు త‌ప్పుకుంటే మేము వేరే కంపెనీలతో ముందుకెళ్తాం. ఇలా ఇద్ద‌రు ముగ్గురి ప్ర‌యోజ‌నాల కోసం ఇలా బంద్ విర‌మించుకోవ‌డం క‌ర‌క్ట్ కాదు. దీనిపై ఒక‌సారి పున‌రాలోచ‌న చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో జోక్యం చేసుకొని అంద‌రికీ మంచి జ‌రిగేలా చూడాల‌ని కోరుకుంటున్నా. ఇప్ప‌టికే చాలా కంపెనీలు త‌క్కువ రేటుకే ప్రొవైడ్ చేస్తామంటూ ముందుకొస్తున్నాయి. వారిని ఎంక‌రేజ్ చేయాల‌ని ప్ర‌భుత్వం వారిని కోరుకుంటున్నా“ అన్నారు.

- Advertisement -