కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో తెలుగుతేజం, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా సెమీస్‌లో ఆరోసీడ్, చైనా క్రీడాకారిణి హి బింగ్‌జియావోతో తలపడింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో సింధు 21-10, 17-21, 21-16తో మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు తొలి గేమ్‌ని 21-10తో సొంతం చేసుకుంది. ఐతే రెండో గేమ్.. తొలి గేమ్‌కి పూర్తి భిన్నంగా సాగింది. ప్రత్యర్థి నుంచి సింధుకి వూహించని ప్రతిఘటన ఎదురైంది. దీంతో 16-16 వద్ద పాయింట్లు సమమైన తర్వాత బింగ్‌జియావో పుంజుకుని వరుస పాయింట్లు సాధించి 21-17తో రెండో గేమ్‌ను గెలుచుకుంది.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు ప్రత్యర్థిపై విరుచుకుపడింది. దీంతో ఈ గేమ్ నువ్వానేనా అన్నట్లు సాగింది. పలుమార్లు ఇద్దరి మధ్య పాయింట్లు సమమయ్యాయి. ఒత్తిడిలో ఆడటం అలవాటైన సింధు సరైన సమయంలో పుంజుకుని వరుస పాయింట్లు సాధించి 21-16 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడు ఒకుహరాతో తలపడనుంది. ఆదివారం ఫైనల్ జరగనుంది. సింధు-ఒకుహర మధ్య పోరు కోసం బ్యాడ్మింటన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.