టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖ నాకు రెండు కళ్లు

521
puvvada ajay
- Advertisement -

ప్రజలకు సేవలు అందించే సంస్థ, శాఖలలో టి.ఎస్‌.ఆర్టీసీ, రవాణా శాఖలు ప్రధానమైనవని, ఈ నూతన సంవత్సరంలో ఇవి మరింత పురోభివృద్ధి సాధించాలన్నదే తన ఆకాంక్ష అని, ఈ రెండూ తనకు రెండు కళ్లలాంటివని రవాణా శాఖా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్‌ కుమార్‌ అభివర్ణించారు. కొత్త సంవత్సరంలో చేపట్టాల్సిన సంస్కరణలు, విధి విధానాల అమలు తీరుపై మంత్రి ఆర్టీసీ, రవాణా శాఖా అధికారులతో సమావేశయ్యారు. టి.ఎస్‌.ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, టి.ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్‌ శర్మ, ఐ.ఎ.ఎస్‌, రవాణా శాఖ కమిషనర్‌ శ్రీ సందీప్‌ సుల్తానియా, తదితర అధికారులతో కలిసి కేక్‌ను కట్‌ చేసి ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉందని, 20-20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే సమయంలో నేర్పుతో పాటు మెరుగైన ఆటతీరును కనబరిచి విజయాన్ని చేకూర్చడానికి క్రీడాకారులు ఎలా ప్రయత్నిస్తారో అలా ఉద్యోగులు, అధికారులు అందరూ పురోభివృద్ధి కోసం కృషి చేయాలని మంత్రి కోరారు. నిజాం కాలం నాటి నుంచి ప్రజలకు ఎంతో సేవలు అందిస్తూ రూపాంతరం చెందిన టి.ఎస్‌.ఆర్టీసీ అభ్యున్నతి కోసం దార్శనిక దృష్టితో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచించిన సంస్కరణలతో సంస్థ ఆర్థిక పురోగతి సాధించగలదన్నారు.

విధి నిర్వహణలో మెరుగైన పనితీరును కనబరిచి వచ్చే సంవత్సరం నాటికి బోనస్‌ అందుకునే స్థాయికి సంస్థను తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి తనకు తండ్రిలాంటివారని, ఆయన ఆకాంక్షించిన విధంగా బంగారు తెలంగాణలో ఆర్టీసీ, రవాణా శాఖలను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే తన కల అని, ఈ మేరకు అధికారులు కూడా తోడ్పాటు అందిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ సమ్మె కాలంలో ఎం.డి నుంచి డిపో మేనేజర్ల వరకు అందరూ బాగా శ్రమించారని, ఆర్టీఏ సహకారంతో ప్రజలకు రవాణా సదుపాయల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. సమస్యాత్మక సమయంలో ఎం.డి శ్రీ సునీల్‌ శర్మ అనేక వత్తిళ్లను అధిగమించి సంస్థ బాగు కోసం ప్రభుత్వానికి అండగా నిలిచారంటూ మంత్రి కితాబు ఇస్తూ నాటి సమ్మె రోజుల్ని గుర్తు చేశారు. ఆర్టీసీ, ఆర్టీఏ సమన్వయంతో పని చేసి ప్రజలకు సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ స్ఫూర్తితోనే మరింత మెరుగైన పనితీరు కనబరిచి ఉత్తమ ఫలితాలు తీసుకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఆర్టీసీ వెలువరుస్తున్న ప్రస్థానం జనవరి సంచికతో పాటు రవాణా శాఖ డైరీ, క్యాలెండర్‌ను మంత్రి శ్రీ పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహరించేలా నూతన విధానాలను అమలులోకి తీసుకు రావడమే కాకుండా ఏజెంట్లు లేకుండా సేవలు అందించే స్థితికి ఆర్టీఏ చేరుకోవాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ సూచికలో తెలంగాణా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నెం.1 స్థాయిలో ఉండాలని, దేశంలో ప్రమాదాల గణంకాలు ఆందోళన కల్గిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమ, నిబంధనల్ని పాటించినప్పుడే ప్రమాదాల రేటు తగ్గుతుందన్నారు. పరివర్తన చెందినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని, ఈ దిశగా అందరి ప్రయత్నం ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎం.డి, టి.ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ,ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియాతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పురుషోత్తం, శ్రీ వినోద్‌, టి.వి.రావు, యాదగిరి, వెంకటేశ్వర్లు, తదితర అధికారులు పాల్గొని మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -