డ్రగ్స్ కేసులో కెల్విన్ అరెస్ట్ తరువాత సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా బయటపడ్డ సంగతి తెలిసిందే.. ఇందులో ప్రముఖంగా వినిపించిన పేరు దర్శకుడు పూరీ జగన్నాద్.. ఈ కేసులో పూరీ పాత్ర ఎక్కువగా ఉందన్న సమాచారంతో పోలీసులు పక్కా స్కెచ్‌తో ఆధారాలతో సహా సినీ ప్రముఖులను రోజుకోకరి చొప్పున విచారిస్తున్నారు. ఇప్పటికే నలుగురి విచారణ పూర్తైంది.. ఈ విచారణలో మరికొందరి పేర్లు భయటపడడంతో వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్దమవుతోంది. అంతేకాదు దర్శకుడు పూరీ జగన్నాథ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసు మొత్తం ఇప్పటివరకూ పూరీ చుట్టే తిరుగుతూ ఉండటం, ఇతరులకు పంపిణీ చేశాడనటానికి పక్కాగా ఆధారాలు లభించడమే ఆయన అరెస్ట్ కు దారితీయనుందని తెలుస్తోంది. ఇక పూరీ స్వయంగా డ్రగ్స్ తీసుకుంటాడని అనుమానిస్తున్న సిట్, ఇప్పటికే, రక్తం, వెంట్రుకలు తదితర నమూనాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న సిట్ విచారణకు వచ్చిన పూరీ నుంచి సేకరించిన నమూనాలను శుద్ధిచేసి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అందించినట్టు ఉస్మానియా హాస్పిటల్ ఆర్‌ఎంవో ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో రక్తపరీక్షలకు సంబంధించిన అన్నిరకాల పరికరాలు ఉన్నాయి. కానీ గోళ్లు, వెంట్రుకలను పరీక్షించేందుకు మైక్రో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పరికరాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో లేనందున వాటిని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ (సీడీఎఫ్‌డీ)కు పంపించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ నివేదికలో పూరీ డ్రగ్స్ వాడుతున్నట్టు వెల్లడైతే, ఈ కేసులో అది బలమైన సాక్ష్యంగా మారుతుందని సిట్ భావిస్తోంది.
కాగా, పూరీ జగన్నాథ్ ను విచారించిన రోజే, కేసులో ముఖ్యమైన వ్యక్తి అతనేనని, అరెస్ట్ జరుగుతుందని వార్తలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే అప్పుడే పూరీని అరెస్ట్ చేస్తారని భావించినా, తాము కేవలం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసమే ఎదురు చూస్తున్నామని, ఆ నివేదిక రాగానే సినీ ప్రముఖుల అరెస్ట్ ఉంటుందని ఓ అధికారి తెలిపారు. పూరీ జగన్నాథ్ తెప్పించే డ్రగ్స్ ను తనతో పాటు చార్మీ, ముమైత్ ఖాన్ లకు ఇచ్చేవాడని సుబ్బరాజు స్వయంగా వెల్లడించడంతో ఇక అరెస్ట్ తప్పదని సమాచారం.