హైదరాబాద్ నగరంలో డెంగ్యూ, మలేరియా తదితర అంటు వ్యాధుల నివారణకు చేపట్టిన చర్యల్లో భాగంగా కొత్తగా మరో 150 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేయాలని జిహెచ్ఎంసి నిర్ణయిచింది. నగరంలో ఎంటమాలజి విభాగం ద్వారా చేపట్టాల్సిన ఫాగింగ్, స్ప్రేయింగ్ తదితర కార్యక్రమాలపై ఎంటమాలజి అధికారులతో జిహెచ్ఎంసిలో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగం వద్ద ప్రతి మున్సిపల్ వార్డుకు ఒకటి చొప్పున 150 పోర్టబుల్, ప్రతి జోన్ కు రెండు చొప్పున వాహనాలకు అమర్చిన 13 ఫాంగింగ్ మిషన్లు, ప్రతి యాంటి లార్వా ఆపరేషన్ బృందాలకు ఒకటి చొప్పున 668 నాప్ సాక్ స్ప్రేయర్లు, ప్రతి సర్కిల్ కు ఒకటి చొప్పున ఉన్న 30 పవర్ స్ప్రేయర్ల ద్వారా ప్రతిరోజు కనీసం 150 కాలనీలు, బస్తీల్లో ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. వీటికితోడు మరో 150 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లను కొనుగోలుచేసి దోమల నివారణ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో లార్వా నివారణ చర్యలు, గణేష్ నిమజ్జన కొలనుల్లో గంబూసియా చేపల విడుదల, నగరంలోని చెరువులు, కుంటల్లో ఆయిల్ బాల్స్ ప్రయోగం, నీటి నిల్వలను తొలగించడం, వ్యాధులు తరచుగా ప్రబలే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, అంటువ్యాధుల నివారణపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల నిర్వహణ తదితర చర్యలను గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎంటమాలజి, శానిటేషన్, హెల్త్ విభాగాలు విస్తృతంగా చేపడుతున్నాయి. వీటితో పాటు నగరంలో ఉన్న అన్ని మజీదుల్లో శుక్రవారం నాడు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దోమల నివారణ స్ప్రేయింగ్, ఫాగింగ్ లను పెద్ద ఎత్తున నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగంలో ఉన్న 2,375 మంది సిబ్బంది లార్వా నివారణ చర్యలు, కాలుష్య నివారణ చర్యల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.