బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను లూథియానా పోలీసు కమిషనర్ కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ఖండించారు. ఈమేరకు ఆమెను అరెస్టు చేసేందుకు లూథియానా నుంచి ముంబయి వెళ్లిన పోలీసు బృందానికి ఆమె ఆచూకీ దొరకలేదని తెలిపారు. రామాయణం రాసిన వాల్మీకిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని నమోదైన ఫిర్యాదుపై ఆమెపై చర్య తీసుకున్నారు. గతేడాది ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో రాఖీ సావంత్.. వాల్మీకీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆమెపై కేసు నమోదైంది.
ఇంతకీ రాఖీ సావంత్ అప్పుడేమందంటే.. సింగర్ మికా సింగ్ తనను బలవంతంగా ముద్దుపెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఒకప్పుడు హంతకుడైన వాల్మీకి.. తర్వాత రామాయణం రాశారని, అలాగే మికా సింగ్ అప్పుడు తప్పుచేసినా.. ఇప్పుడు మారారని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు మార్చి 9న కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉండగా..రాఖీ సావంత్ హాజరు కాలేదు. దీంతో కోర్టు మరోసారి రాఖీసావంత్‌కి సమన్లు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. అయితే రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నో సార్లు విమర్శల పాలైన సంగతి తెలిసిందే.