సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ విజయం.. ఐపీఎల్‌లో హైదరాబాద్ ఖతం..

54

ఐపీఎల్ 2021 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిష్క్రమించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఫే ఆఫ్స్‌ ఆశలు అడుగంటిపోయాయి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఎట్టకేలకు పంజాబ్‌నే వరించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో సన్‌రైజర్స్ ఖాతాలో గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ, పంజాబ్‌ బౌలర్లు హైదరాబాద్ వికెట్లు టపటపా పడగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వృద్ధిమాన్ సాహా 31 పరుగులు చేయగా, చివర్లో జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపించి జట్టుకు విజయాన్ని అందించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. 29 బంతుల్లో 5 సిక్సర్లతో అజేయంగా 47 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించినప్పటికీ సహచర బ్యాట్స్‌మెన్ నుంచి అతడికి సహకారం అందలేదు. దీంతో ఆ జట్టు 120 పరుగులకే పరిమితమై 8వ పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్‌కు ఇది నాలుగో విజయం కాగా, హైదరాబాద్‌కు 8వ ఓటమి. జాసన్ హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.