కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం పునీత్ అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య ముగిశాయి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో పునీత్ అంతిమయాత్ర ప్రారంభమైంది. కంఠీరవ స్టేడియం నుంచి కఠీరవ స్టూడియో వరకు భారీ కాన్వాయ్ నడుమ అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబ సభ్యులు, యశ్, సుదీప్ తదితర సినీ నటులు, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్దరామయ్య తదితర రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు.అంత్యక్రియలు నిర్వహించే ముందు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు నిల్చుండిపోయారు. మరోసారి పునీతుడి తలను నిమిరారు. చెంపలను తడిమారు. చేతులు జోడించి పార్థివదేహానికి నమస్కరించారు. కన్నీరు పెట్టుకున్నారు.తాను ఎత్తుకుని ఆడించిన తన సోదరుడు పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శివరాజ్ కుమార్ రోదించారు. పునీత్ భార్య అశ్విన్, ఇద్దరు పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.