తమిళనాడులోని అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో రసకందాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది రెండోసారి రిసార్ట్ వేదికగా క్యాంపు రాజకీయాలకు వేదికైంది అన్నాడీఎంకే. అమ్మ మరణం తర్వాత శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వంగా రిసార్ట్ రాజకీయాలు సాగగా ఇప్పుడు శశికళ మేనల్లుడు దినకరన్ వర్సెస్ ముఖ్యమంత్రి పళని స్వామి మధ్య ఉత్కంఠపోరుకు తెరలేచింది. పళనిపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేసిన దినకరన్ వర్గం…19 మంది ఎమ్మెల్యేలతో పుదుచ్చేరిలోని లగ్జరీ రిసార్ట్ విండ్‌ఫ్లవర్‌లో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.
మరోవైపు అన్నాడీఎంకేలోని శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. అసెంబ్లీ వేదికగా పళనిస్వామి బలపరీక్షకు సిద్ధపడాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఈ విషయమై లేఖ రాయగా తాజాగా కాంగ్రెస్ కూడా డీఎంకేతో స్వరం కలిపింది. రాష్ట్రంలో అసాధారణ రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నదని, ఈ నేపథ్యంలో ఎంతమాత్రం జాప్యం చేయకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిందిగా సీఎంకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ని కోరారు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కేఆర్ రామస్వామి.
ఇదిఇలా ఉండగా శశికళ వర్గం ఎమ్మెల్యేలు 19మంది బసచేస్తున్న రిసార్ట్ ముందు అన్నాడీఎంకే వర్గీయులు భారీగా నిరసన ప్రదర్శనకు దిగారు. రిసార్ట్‌లోని ఎమ్మెల్యేలను బయటకు పంపిచాలని డిమాండ్ చేస్తు నిరసనకు దిగగా పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
233 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 134 సభ్యుల బలం ఉంది. జయలలిత మరణంతో ఒక స్ధానం ఖాళీగా ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే మేజిక్ ఫిగర్ 117. శశికళకు 19 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తుండటంతో పళని వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 115కు చేరింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం సీఎం పళనిపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్దంగా ఉండటంతో మరోసారి తమిళ రాజకీయాలు ఆసక్తినిరేపుతున్నాయి. గవర్నర్ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తే ఎవరిది పైచేయి అవుతుందోనన్న సందేహం అందరిలో నెలకొంది.