ప్రజల భాగస్వామ్యం, సమిష్టి బాధ్యతతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం.. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లోని స్టాళ్ళను మంత్రి పరిశీలించారు. గాలి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు కూడా పర్యావరణ సమతుల్యత పట్ల అవగాహనతో మసలుకోవాన్నారు. సామాజిక బాధ్యతగా ప్రకృతి వనరులను పొదుపుగా వాడటం, వాయు, జల, నేల కాలుష్యం కాకుండా మన వంతు ప్రయత్నాలు చేసినప్పుడే కాలుష్య రహిత రాష్ట్రం, దేశాన్ని తయారు చేయగలమని పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని వెల్లడించారు. హరితహారం, స్వచ్ఛ తెలంగాణ, జలహారం, పల్లె, పట్టణ ప్రగతి, మిషన్ కాకతీయ లాంటి అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజలందరి భాగస్వామ్యంలో వీటిని విజయవంతంగా అమలు అయ్యేలా చూస్తున్నామని తెలిపారు.
అడవుల సంరక్షిస్తూ, అభివృద్ధి పరుస్తూనే, విరివిరిగా మొక్కలు నాటే, తెలంగాణకు ఆకుపచ్చల హారంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా ఏడు విడతల్లో 250 కోట్ల మొక్కలు నాటామని, ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 19.54 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి పల్లె, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా దాదాపు 92 వేల కిలోమీట్లర్ల మేర మొక్కలను నాటామన్నారు.
పర్యావరణ పరిరక్షణ,కాలుష్య నియంత్రణకు కాలుష్య నియంత్రణ మండలి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. జల, వాయు, నేల కాలుష్యాన్ని నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు.ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు.పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పీసీబీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
అనంతరం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణలో భాగంగా పరిశ్రమల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడం, గాలి, జల, నేల కాలుష్య నియంత్రణకు చొరవ తీసుకుంటున్న ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్, మేధ సర్వో డ్రైవ్స్, డా.రెడ్డీస్ ల్యాబోరేటరీస్, బయోకాన్ పరిశ్రమల ప్రతినిదులకు పురస్కారాలను ప్రదానం చేశారు. పర్యావరణంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటిల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తర్వాత మొక్కజొన్న పిండితో తయారైన పర్యావరణహిత సంచులను (క్యారీ బ్యాగ్) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అప్పిలేట్ అథారిటీ చైర్మన్ ప్రకాష్ రావు, మెంబర్ డా.జయతీర్ధ రావు, ఎస్ఇఎసీ చైర్మన్ కృష్ణారెడ్డి, పీసీబీ స్టాండింగ్ కౌన్సిల్ శివకుమార్, కార్పోరేటర్ లక్ష్మి బాల్ రెడ్డి, సీఈ డి.రఘు, పీసీబీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీవాత్సవ్, కార్యదర్శి కృఫాకర్, తదితరులు పాల్గొన్నారు.