దళితుల..ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు

208
k chandra shekar rao
- Advertisement -

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని సీఎం కేసీఆర్ తెలిపారు. భారత్ బంద్ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో దళితులపై జరిగిన దాడిని ఖండించిన కేసీఆర్.. అణచివేతకు గురైన దళితులకు అండగా ఉండటం కోసం..రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని తెలిపారు.దళితులకు కల్పించిన హక్కులు, తీసుకువచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు ప్రభుత్వం, సమాజం అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితులకు రక్షణగా ఉండడం కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు దళితుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయస్థానానికి చెప్పాలని ప్రధానిని కోరుతున్నానని సీఎం తెలిపారు.

దళితుల అభిప్రాయాలను, మనోవేదనను న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం కూడా న్యాయస్థానం మార్గదర్శకాలపై స్పందించాలి. దళితుల వెంట తాము ఉన్నామనే భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస కర్తవ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తమ హక్కులకు, చట్టాలకు భంగం కలుగుతుందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలని సీఎం కోరారు.

- Advertisement -