తెలుగు రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నర్లు రానున్నారా..?ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌కు కీలక పదవి రాబోతుందా అంటే రాజకీయవర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో తెలంగాణ,ఏపీకి కొత్త గవర్నర్లను నియమించనున్నారని కేంద్ర వర్గాల సమాచారం. ఇక ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమైన పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. నరసింహన్‌ను బదిలీ చేయడం లేక జమ్మూ కశ్మీర్ వ్యవహారాల సలహాదారుగా నియమించే అవకాశం ఉందని హోంశాఖ వర్గాల సమాచారం.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత గవర్నర్ల నియమాకం జరిగే అవకాశం ఉంది. విజయవాడలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఆఫీసుగా ఉన్న కార్యాలయాన్ని గవర్నర్ కార్యాలయంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ ఆఫీసులోనే ఏపీ గవర్నర్ కొలువుతీరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2009 డిసెంబరు నుంచి గవర్నర్‌గా కొనసాగుతున్నారు నరసింహన్. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ,అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తుండటం,హైకోర్టు విభజన కూడా జరిగిన నేపథ్యంలో వేర్వేరు గవర్నర్లను నియమిస్తే బాగుంటుందని కేంద్రం భావిస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు.