స్వరాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా జీవితాంతం లడాయి చేసిన పోరాటయోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఉద్యమాల ఉపాధ్యాయుడు.. తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన పోరాటయోధుడు…ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఇవాళ జయశంకర్ సార్ జయంతి . పుట్టుక ఆయనదే.. చావు ఆయనదే. కానీ… జయశంకర్ సార్ బతుకంతా తెలంగాణది.
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత.. ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్ లో జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటల మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించారు …. జయశంకర్. చిన్నప్పటి నుంచి అన్యాయంపై గొంతెత్తిన ఆయన.. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి తెలంగాణ నినాదాన్ని భుజాన వేసుకున్నారు. నాన్ ముల్కీ ఉద్యమం మొదలుకొని.. మలిదశ పోరాటం వరకు ప్రతి మలుపులోనూ ఆయన పాత్ర అనిర్వచనీయం.
తెలంగాణ సిద్ధాంతకర్తగా అందరికీ దశ, దిశ చూపించిన దార్శనికుడాయన. తెలంగాణ కోసమే అనుక్షణం పరితపించి… స్వరాష్ట్రాన్ని చూడకుండానే వెళ్లిపోయిన పెద్దసారుకు మరణం లేదు. ఇవాళ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ఘననివాళి అర్పిస్తోంది.