బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం క్వాంటికో సిరీస్ 3లో బిజీగా ఉన్న ప్రియాంక..మలయాళ నటి భావనకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపింది. భావన తన ప్రియుడు నవీన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నూతన దంపతులకు ప్రియాంక సోషల్‌మీడియా వేదికగా సందేశం పంపారు.
మీ ఇద్దరికి శుభాకాంక్షలు. మీ ప్రయాణంలో ఇది ముఖ్యమైన ఘట్టం. అదృష్టం మీ వెంట ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు నిజంగా చాలా ధైర్యమున్న మహిళవి భావన. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నీపై ఉన్న అభిమానం ఎప్పుడూ ఇలానే ఉంటుంది’ అని ప్రియాంక వీడియోలో చెప్పారు.
భావనకు ప్రియాంకా చోప్రాతో అంత ఫ్రెండ్ షిప్ ఉందనే విషయం తెలుసుకుని భావన ఫాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కేరళ సినిమా పరిశ్రమను కుదిపేసిన లైంగిక వేధింపుల ఇష్యూ లో భావన చూపిన తెగువ అన్ని బాషా నటీనటులను ఆకర్షించింది. అందరు భావనకు బాసటగా నిలిచారు. తనకు జరిగిన అవమానం ఏ మాత్రం మొహమాటపడకుండా బయట పెట్టిన తీరు ప్రియాంకా చోప్రాను కూడా కదిలించింది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.