కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి తెరపడుతూ సంకీర్ణానికి బీజేపీ షాకివ్వగా తాజాగా మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదని వాదనలు వినిపిస్తున్నాయి. స్వల్ప మెజార్టీతో ఉన్న మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బదులు రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన 16మంది రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేవరకు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్దంగా లేదని సమాచారం. ఒకవేళ ఈ 16 మంది మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వారికి మంత్రిపదవులు ఇవ్వాల్సి రావడం,బీజేపీలోని సీనియర్‌ల నుంచి కేబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని కమలనేతలు భావిస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించేంతవరకు వారు అసెంబ్లీ సభ్యులుగానే కొనసాగుతారు. దీంతో మొత్తం 225 సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీకి ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో కలిపి 107మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది.
ఒకవేళ బలనిరూపణకు వెళ్లి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైనా ప్లేటు పిరాయిస్తే అబాసుపాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేదన్న సంకేతాలనిచ్చారు. మొత్తంగా కర్ణాటక రాజకీయ అనిశ్చితి ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో వేచిచూడాలి.