తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగుతున్న తెలుగు మహాసభలు నేటితో ముగియనున్నాయి. ఈ ముగింపు కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా కోనసాగుతోంది. ఎల్బీస్టేడియంలోని పాల్కూరికి సోమనాథుని ప్రాంగణం బమ్మెర పోతన వేదిక మీద ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగు భాషా అభ్యున్నతి కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయనకంటే ముందు ముగ్గురు తెలుగు వారు రాష్ట్రపతులయ్యారని గుర్తుచేశారు. తెలుగు తెలిసిన రాష్ట్రపతుల్లో సర్వేపల్లి, వివి గిరి, సంజీవరెడ్డి ఉన్నారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
దేశంలో అత్యదికంగా మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి అన్నారు. 42 దేశాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవడం చాలా గొప్పవిషయమని, రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానన్న కోవింద్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ.. తెలుగు ప్రపంచ భాష అని కొనియాడారు.
అలాగే స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు వారి త్యాగాలు మరువలేనివని, అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. కాగా..ఎల్బీస్టేడియంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.