అంతర్ యుద్ధంతో సిరియా భగ్గు మంటోంది. ప్రభుత్వ బలగాలు మిలిటెంట్లపై జరుపుతున్న దాడుల వల్ల అమాయక ప్రజలే సమిధలవుతున్నారు. ముక్కుపచ్చలారని పిల్లలు, మహిళలే అధిక సంఖ్యలో మరణించడం, సిరియాలో జరుగుతున్న నరమేధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రభుత్వ బలగాలు, ప్రీ సిరియన్ ఆర్మీకి మధ్య 2011లో మొదలైన పోరు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మిలిటెంట్లను ఏరివేసేందుకు ప్రభుత్వ బలగాలు గత వారం రోజులుగా గౌటా నగరంపై వైమానిక దాడులు జరుపుతున్నాయి.గౌటా నగరంలో జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం ఆందోళనకు గురవుతోంది. నెల రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని భద్రతామండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానికి రష్యా అనుకూలంగా ఓటు వేసినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. మానవతా దృక్పథంతో రోజుకు 5 గంటల పాటు దాడుల్ని ఆపుతామని…ఆ సమయంలోనే జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయినా దాడులు కొనసాగుతుండడంతో సుమారు 4 లక్షల మంది పౌరులు యుద్ధక్షేత్రంలో చిక్కుకుపోయారు.
సున్నీ జనాభా అధికంగా ఉన్న సిరియాలో దేశాధ్యక్షుడు బషర్-అల్ అసద్ మాత్రం షియా. ఆయన నియంతృత్వ ధోరణి, పాలనావైఫల్యాలపై తిరుగుబాటు మొదలైంది. అదే సమయంలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులతోనూ, ఐఎస్ దళాలతోనూ బషర్-అల్-అసద్ ప్రభుత్వ సేనలు పోరు సాగిస్తున్నాయి. అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుండగా, తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇస్తున్నది.
రెండు అగ్రరాజ్యాలు రెండువైపులా మద్దతుగా నిలువడంతో సిరియా అనే చిన్న దేశంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. 2011 నుంచి ఇప్పటివరకు తూర్పు గౌటాలో 12,763 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.సిరియాలో రక్తమోడుతున్న బాల్యంపై సోషల్‌మీడియా తల్లడిల్లుతున్నది. రక్తచారికలతో ఉన్న చిన్నారి ఫొటోలు నెటిజన్లను కదిలిస్తున్నాయి. ప్రే ఫర్ సిరియా (సిరియా కోసం ప్రార్థించండి) అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫొటోలను షేర్ చేస్తున్నారు.