మధ్యప్రదేశ్‌లో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు ఆపార్టీకి గుడ్ బై చెప్పడంతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
దీంతో బీజేపీకి మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతవేటుపడగా త్వరలో బై ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ని ఎన్నికల్లో గెలుపుకోసం సంప్రదించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించారు ప్రశాంత్ కిశోర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తనకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్ నాథ్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారు. కానీ తాను అంగీకరించలేదన్నారు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని స్పష్టంచేశానని వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరపున, తమిళనాడులో డీఎంకే తరపున పనిచేస్తున్నారు ప్రశాంత్ కిశోర్.