“అ!” సినిమాతో మనందరికీ వినూత్న అనుభూతిని కలిగించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో “గరుడ వేగ” తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ కథానాయకుడిగా వస్తున్న చిత్రం టైటిల్ ఈ నెల 26 న విడుదల చేయబోతున్నట్లు వచ్చిన వార్త సినీ ప్రేమికుల్లో ఎంత ఉత్సుకతను రేపిందో వేరే చెప్పనక్కర్లేదు. ఇటీవల వచ్చిన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ఎంతో నేర్పుగా ,వినూత్నంగా ఉందనే చెప్పాలి.
ఓ పాత ఇంగ్లిష్ న్యూస్ పేపర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ పోస్టర్లో ఒకపక్క 1983 లో జరిగిన వన్డే క్రికెట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ ని అందుకుంటున్న కపిల్ దేవ్ న్యూస్, అలాగే మరో పక్క మెగా స్టార్ చిరంజీవి ఖైదీ మూవీ విడుదలైన వార్తను సమకూర్చి ఈ చిత్రం యొక్క నేపథ్యం 1983 సంవత్సరానికి చెందినదని చెప్పకనే చెప్పారు ప్రశాంత్ వర్మ. హంతకుడు ఎవరు అని ఇంగ్లీష్ హెడ్లైన్ పెట్టారు కాబట్టి కథ మొత్తం ఓ హత్య కేసు వెనుక సాగుతుందని అర్ధమవుతుంది. ప్రీ లుక్ పోస్టర్ నే ఇంత చాకచక్యంగా రూపొందించిన చిత్ర బృందం ఈ చిత్రానికి ఎలాంటి టైటిల్ ని ఖరారు చేయబోతుందో అని అటు ప్రేక్షకులు, ఇటు విశ్లేషకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇంకా ఆ తేదీ రాకముందే ఇదే టైటిల్ అని వస్తున్న ఓ పేరు మాత్రం సోషల్ మీడియా లో దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒకటిగా పేరుగాంచబడ్డ “కల్కి” ని ఈ సినిమా యొక్క టైటిల్ గా ఖరారు చేసినట్టు వచ్చిన వార్త సోషల్ మీడియా లో విహంగం లా విహరిస్తోంది. ఏది ఏమైనా గరుడ వేగ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో వచ్చిన రాజశేఖర్ ఇప్పుడు ఇలా వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే సాహసం చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమా తో రాజశేఖర్ పాత వైభవం మళ్ళీ తిరిగి వస్తుందా.. లేక ఈ సినిమా కూడా “అ!” సినిమాలా ఓ కొత్త ప్రయోగంలా మిగిలిపోతుందా అనేది వేచిచూడాలి.