ఆరంభం అదిరిపోవాలి…

399
World Telugu Conference 2017
- Advertisement -

ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుక ఈనెల 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో 5గంటలసేపు నిర్వహించనున్నారు. స్వాగత వచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు, పుస్తకాలు, సీడీల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు నిర్వాహక కమిటీ షెడ్యూలును రూపొందించింది. 15న సాయంత్రం 5గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ముందుగా జనగణమనతో సభ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ సలహాదారు కేవీరమణాచారి స్వాగత వచనాలు పలుకుతారు. గణపతి, సరస్వతి ప్రార్థన గీతాలను ఆలపిస్తారు. మహాసభలపై రూపొందించిన పద్యం, వచన కవిత్వాన్ని ఇద్దరు కవులు పఠిస్తారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాశస్త్యాన్ని వివరించే 40 నిమిషాల వీడియోను ప్రదర్శిస్తారు.

Prapancha Telugu Mahasabhalu 2017

తర్వాత మందార మకరందాలు, వాగ్భూషణం- భూషణం, తెలుగు సంవత్సరాలు, మాసాలు, రుతువులు, కార్తెల వివరాలతో కూడిన మరో పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరిస్తారు. అనంతరం 80 పద్యాలతో రూపొందించిన సీడీని విడుదల చేస్తారు. తర్వాత సభలో ప్రసంగాలు ప్రారంభవుతాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌విద్యాసాగర్‌రావు మాట్లాడతారు. అనంతరం 15 నిమిషాలపాటు సీఎం ప్రసంగిస్తారు. చివరగా ముఖ్యఅతిథి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, పేరిణి, ఒగ్గుడోలు, నృత్యాలు ఉంటాయి.

తెలుగు మహాసభలను పురస్కరించుకొని ప్రధాన వేదిక, మరో మూడు వేదికల అలంకరణలు, మరమ్మతులు, ఏర్పాట్లకు రూ.70 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రూ.50 లక్షలతో ఎల్బీ స్టేడియానికి రంగులు, ప్రాంగణం అలంకరణలు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియానికి రూ.10 లక్షలు, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్రభారతిలకు రూ.అయిదేసి లక్షలను కేటాయించారు.

Prapancha Telugu Mahasabhalu 2017

ప్రారంభ వేడుకల రోజున ఎల్బీస్టేడియం చుట్టూ 100 స్టాళ్లను ప్రారంభిస్తారు. ఇందులో 75 వరకు భోజనం స్టాల్స్‌. మిగిలినవి హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఇతర వస్తుపరికరాలకు సంబంధించినవి. ప్రారంభోత్సవం తర్వాత అతిథులకు వారికి కేటాయించిన హోటళ్లలో భోజన వసతి కల్పించారు. సందర్శకులు స్టేడియం బయట గల స్టాళ్లలో డబ్బులు చెల్లించి భోజనాలు చేయాలి. రెండోరోజు వేదికల వద్ద మధ్యాహ్న భోజన సమయంలో శాకాహార భోజనం అందిస్తారు. అతిథులు, ఆహ్వానితులు, ప్రతినిధులకు రాష్ట్ర హస్తకళల సంస్థ తయారుచేసిన సంచులను అందజేస్తారు. ఇందులో తెలంగాణ సాహిత్య పుస్తకాలుంటాయి.

ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేక సంచికతో పాటు వాజ్మయం, తెలంగాణ తేజోమూర్తుల గ్రంథం, తెలంగాణ వాణిని విడుదల చేస్తున్నామని విశ్వవిద్యాలయ వీసీ ఎస్వీ సత్యనారాయణ ఆదివారం తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయ మ్యూజియం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

దేశవిదేశాల నుంచి ప్రముఖులు ఈనెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఇందులో విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు డాక్టర్‌ అఫ్సర్‌ (ఖమ్మం), న్యూజెర్సీలోని కవి నారాయణస్వామి వెంకటయోగి, వర్ణీనియాలోని కవి వీరెల్లి రవి (దూప పుస్తక రచయిత), జార్జ్‌మాసన్‌ విశ్వవిద్యాలయ ఆచార్యురాలు ప్రభావతి(మహబూబ్‌నగర్‌) కన్నెగంటి చంద్ర, వింజమూరి రాగసుధ, సృజన్‌రెడ్డి హాజరవుతున్నారని సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కవులు, రచయితలు పాపినేని శంకర్‌, కొప్పర్తి, కత్తుల కిశోర్‌బాబు, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్‌, బండ్ల మాధవరావు, పెనుగొండ లక్ష్మినారాయణ, రాచపాల చంద్రశేఖర్‌, కాళీపట్నం రామారావు, కాట్రగడ్డ దయానంద్‌, పాటిబండ్ల రజిని, వల్లూరి శివప్రసాద, అట్టాడ అప్పలనాయుడు, వీఆర్‌ రాసాని, మధురాంతకం నరేంద్ర ఉన్నారు.

- Advertisement -