దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ‘ప్రణామం’, ‘బాల భరోసా’ అనే రెండు వినూత్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. దివ్యాంగుల సాధికారత కోసం రూ. 43.22 కోట్ల విలువైన అత్యాధునిక సహాయక పరికరాలను సుమారు 7 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ పరికరాల జాబితాలో దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, వీల్ చైర్లతో పాటు విద్యా, ఉపాధి అవకాశాల కోసం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు ఉన్నాయి.
వృద్ధుల కోసం ‘ప్రణామం’ డే కేర్ సెంటర్లు వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడే వృద్ధుల మానసిక ఉల్లాసం, సంరక్షణ కోసం ‘ప్రణామం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను మంజూరు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హన్మకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగిలిన జిల్లాల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ కేంద్రాల్లో లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉంటాయి. కేవలం వినోదమే కాకుండా, అక్కడికి వచ్చే వృద్ధులకు ఉచితంగా పోషకాహారం అందిస్తారు. ప్రతి సెంటర్ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 12.48 లక్షలను వెచ్చిస్తోంది.
వైకల్య రహిత తెలంగాణే లక్ష్యంగా ‘బాల భరోసా’ రాష్ట్రంలోని చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ‘బాల భరోసా’ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఉండే శారీరక లేదా మానసిక వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వాటిని నివారించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అంగన్‌వాడీ టీచర్ల ద్వారా ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహించి, సమస్య ఉన్న పిల్లలను పీహెచ్‌సీలు లేదా RBSK ద్వారా వైద్య పరీక్షలకు పంపిస్తారు. అవసరమైన పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా శస్త్రచికిత్సలు, ఫిజియోథెరపీ, పునరావాస సేవలను కల్పిస్తుంది.
Also Read:‘మన శంకర వరప్రసాద్ గారు’..రివ్యూ

