స్వాతంత్యం వచ్చాక తొలిసారి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశామని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన ప్రణబ్ అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈ అంశంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారన్నారు. 5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ల లక్ష్యం కాగా.. ఇప్పటికే 1.20 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు రాష్ట్రపతి తెలిపారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత తమదేనన్నారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసిన వేళ, సర్జికల్ దాడులు జరిపితే, వాటిని ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించారని గుర్తు చేశారు. భారత సైన్యం చూపించిన అసమాన ధైర్యసాహసాలకు జాతి యావత్తూ సెల్యూట్ చేసిందని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తరువాత ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ప్రభుత్వ నిర్ణయంతో తమకు మేలు కలుగుతుందని నమ్మారని, వారి నమ్మకాన్ని వమ్ము కానీయబోమని తెలిపారు.
గర్బిణీ స్త్రీలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 24 వారాలకు పెంచిన ఘనత తన ప్రభుత్వానిదేనని అన్నారు. అసంఘటిత రంగాల్లోనూ ఉద్యోగులకు జీతాలను బ్యాంకుల ద్వారా చెల్లించే ఏర్పాటు చేశామని ప్రణబ్ గుర్తు చేశారు. ఏడో వేతన సంఘ సిఫార్సుల అమలు ద్వారా 50 లక్షల మంది ఉద్యోగులకు లాభం కలిగిందని తెలిపారు. వీరికి అదనంగా మరో 30 లక్షల మందికి వస్తున్న పెన్షన్ మొత్తం పెరిగిందని తెలిపారు.
గడిచిన రెండేళ్లలో బేటీ పడావో బేటీ బచావో పేరుతో లింగ వివక్ష లేకుండా చూశామన్నారు. సైనికులకు వన్ ర్యాంకు వన్ పెన్షన్ విధానం అమలు చేస్తున్నామన్నారు. టెర్రరీజం అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సబ్‌కా సాత్ – సబ్‌కా వికాస్ నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు. పీడిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని తెలిపారు.
దేశంలో 60 శాతం మందికి పైగా ప్రజలు యువతేనని, వారి బలమే దేశాన్ని ముందుకు నడిపిస్తోందని, ఎన్నో దేశాలకన్నా మిన్నగా దేశ వృద్ధి రేటు ఉండటం యువ శక్తికి నిదర్శనమని ప్రణబ్ తెలియజేశారు. ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించి విజయవంతం కావడం టెక్నాలజీ, అంతరిక్ష రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ఘనతని కొనియాడారు. లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చలు జరగాల్సి వుందని ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.