భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం హైదరాబాదుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర్రపతికి గవర్నర్ నరసింహ, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసన సభ స్పీకర్ మధుసుదానాచారి, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్..పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి పాదాభివదనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శాలువ కప్పి ఆహ్వానించాడు. హకీంపేట నుంచి రాష్ట్ర్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. డిసెంబర్ 22 నుంచి 31 వరకు 10 రోజుల పాటు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేస్తారు. దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నగరంలో విడిది చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పర్యటనలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు.
తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న పలు కార్యక్రమాలకు హాజరవుతారు. డిసెంబర్ 23న ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో ఎండీఎస్, బీడీఎస్‌ల స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. అదేరోజు ఎఫ్‌టీఏపీసీసీఐ సెంటినరీ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఆయన పాల్గొంటారు. ఈ నెల 24న నగరంలో మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మలాని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లను ప్రారంభిస్తారు. 25న బెంగళూరుకు బయలుదేరనున్నారు. 26న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 29న తిరువనంతపురంలో 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
ప్రణబ్ శీతాకాల విడిది నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో రోడ్లకు మరమ్మతులు, స్వాగత తోరణాలు, హెలిప్యాడ్‌ల ఏర్పాట్లు, బారీకేడ్ల నిర్మాణం చేపట్టారు.