సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పనితీరుపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ పనితీరును ప్రశంసించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అత్యంత సమర్ధవంతంగా లోక్ సభ ఎన్నికలను నిర్వహించారని ఈసీని కొనియాడారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్..ప్రభుత్వ వ్యవస్థల్ని బలోపేతం చేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గుర్తుపెట్టుకోవాలన్నారు.
చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడు.మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడని ఈసీ పై విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు చురకలంటించారు ప్రణబ్.
ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటీ వరకు ఆ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికల నిర్వహణను పటిష్టంగా చేపట్టారన్నారు. వాళ్లను విమర్శించలేమని, చాలా పర్ఫెక్ట్‌గా ఎన్నికలు నిర్వహించారని ప్రణబ్ కితాబు ఇచ్చారు. భారత ప్రభుత్వ వ్యవస్థలన్ని అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈసీ పక్షపాత ధోరణితో ఏకపక్షంగా వ్యవహరించిందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.