ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న అరెస్టులు, రాజకీయ పరిణామాలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఒక ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ (X) ద్వారా పాలకులను నిలదీశారు.
రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను తప్పుబడుతూ.. ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో మొదలుపెట్టిన మీ ఆటను ముగించేది ప్రజలే అంటూ ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. ఈ వ్యవహారంలో చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తికి నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా, ఎలాగైనా జైల్లో ఉంచాలనే ఉద్దేశంతో ఉగ్రవాద నిరోధక చట్టం ‘ఉపా’ (UAPA) సెక్షన్‌ను ప్రయోగించి రిమాండ్‌కు పంపడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నాలుగు సార్లు కోర్టు బెయిల్ ఇచ్చినా UAPA సెక్షన్‌తో రిమాండ్ లోకి పంపడం దారుణం. యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహమా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ దాడులు జరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేనకు చెందిన ‘జనసైనికులు’ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుంటూ మార్ఫింగ్ వీడియోలతో క్యారెక్టర్ అససినేషన్ (వ్యక్తిత్వ హననం) చేయడం మొదలుపెట్టారని ఆయన మండిపడ్డారు.
Also Read:ఇండోనేషియాకు ప్రధాని మోదీ
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ నిరంతరం స్పందిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తోందని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై కూటమి కూటమి నేతలు, జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

