ధర్మస్థల కేసుతో తన పేరును జోడిస్తూ వస్తున్న వార్తలు మరియు సోషల్ మీడియా చర్చలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ…మరో రెండు రోజుల్లో తాను స్వయంగా దీనిపై సమాధానం ఇస్తానని చెప్పారు. కన్నడలో చేసిన ఒక ట్వీట్‌లో ఈ విషయం అత్యంత సున్నితమైనదని మరియు లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం.. మీడియాలో, సోషల్ నెట్‌వర్క్‌లలో ధర్మస్థల కేసుకు సంబంధించి నాపై వస్తున్న కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఇది అత్యంత సున్నితమైన విషయం కాబట్టి.. అలాగే లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించినది కాబట్టి.. ఇలాంటి అనుమానాలకు సమాధానం చెప్పడం నా బాధ్యత కూడా అని పేర్కొన్నారు.
తాను ప్రస్తుతం దూరంగా ఉన్నానని త్వరలోనే మాట్లాడతానని ప్రకాష్ రాజ్ తెలిపారు. నేను ప్రస్తుతం చాలా దూరంలో ఉన్నాను…. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి మీడియా మిత్రుల ద్వారా స్పందిస్తాను. అంతవరకు ఎలాంటి గాలి వార్తలను నమ్మకండి.. అలాగే కొందరు దుర్మార్గులు ఈ వార్తలకు రెక్కలు తొడిగి ప్రచారం చేయాలని చూస్తున్నారు, వాటిని నమ్మకండి అన్నారు.
ధర్మస్థల కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి రావడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. తన రిట్ పిటిషన్‌లో చిన్నయ్య పేర్కొంటూ.. కొందరు వ్యక్తులు సూచించిన విధంగానే స్టేట్‌మెంట్లు ఇవ్వాలని తనకు ఆదేశాలు వచ్చాయని…ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని ఆరోపించారు.
Also Read:సింగ్ గీతం..పెద్ద బ్లాక్‌బస్టర్!
ధర్మస్థల సామూహిక పూడ్చివేత కేసు 2025లో వెలుగులోకి వచ్చింది. ఆ క్షేత్ర పరిసర ప్రాంతాలలో గత రెండు దశాబ్దాలుగా వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టేలా తనను బలవంతం చేశారని ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు ఆరోపించడంతో ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. అతని ఆరోపణల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి అతను గుర్తించిన పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం ప్రారంభించింది. గుర్తించబడని బాధితులు, అదృశ్యమైన వ్యక్తులు మరియు తవ్వకాల్లో అస్థిపంజరాలు లభించడం వంటి దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు రావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దర్యాప్తు అధికారులు ఆధారాలను పరిశీలిస్తున్నప్పటికీ ధర్మస్థలలో అసలు ఏం జరిగిందనే దానిపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు అనుత్తరితంగానే మిగిలిపోయాయి.

