తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ పేరుతో నేటి నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల కార్యాచరణను చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
ఈ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే పది వారాల పాటు ప్రతి వారం ఒక ప్రత్యేక శాఖకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆ శాఖకు సంబంధించిన పథకాలు, సేవలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా వారోత్సవాలను నిర్వహించనున్నారు.
Also Read:రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు
ఇంకా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలను నిర్వహించి లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ఈ 99 రోజుల కార్యక్రమంలో సర్పంచ్‌ల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయనున్నారు. ప్రభుత్వ–ప్రజల మధ్య సమన్వయం పెంచి అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.

