దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమా విడుదలకు ముందే భల్లాల దేవుడు రానా మెడపై కత్తిపెట్టి బాహుబలి ప్రభాస్, దేవసేన అనుష్క సరదాగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ దృశ్యం ముంబయిలో నిర్వహించిన వరల్డ్ బాహుబలి ఈవెంట్‌లో కనిపించింది. వేదికపైకి కత్తులతో ప్రవేశించిన ప్రభాస్, అనుష్కలు అక్కడే ఉన్న భల్లాల దేవుడు రానాకి ఇరువైపులా నించొని, ఆయన గొంతుపై కత్తులుపెట్టారు.
ఈ ఫొటోని బాహుబలి టీమ్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా కేరళలో 300 థియేటర్లకు పైగా విడుదల కాబోతుందని, అక్కడి 100కు పైగా థియేటర్లలో ఉదయం 6 గంటల షో కూడా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాను ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. బాహుబలి-2 ప్రచార కార్యక్రమాల్లో ఆ సినిమా యూనిట్ జోరుగా పాల్గొంటోంది.
మరి బాహుబలి2 ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది. మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నా.. ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలవుతుండడంతో.. మూవీ యూనిట్ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజిగా ఉన్నారు. భల్లాలదేవుడు పాత్రధారి రానా.. ప్రస్తుతం కొచ్చిలో ప్రచార కార్యక్రమాల్లో ఉన్నాడు. బాహుబలి చేస్తూనే.. ఇతర సినిమాలు చేసే అవకాశం ఎలా వచ్చిందో చెప్పాడు రానా.
నిజానికి ప్రభాస్ తప్ప బాహుబలిలోని మిగిలిన అందరు యాక్టర్స్ ఇతర చిత్రాలు కూడా చేసుకున్నారు. రానా అయితే.. తెలుగులో రుద్రమదేవి.. హిందీలో బేబీ.. తమిళ్ లో బెంగళూరు డేస్.. త్రిభాషా చిత్రం ఘాజీల్లో నటించాడు. బాహుబలి కోసం బాడీ పెంచేందుకు.. దాన్ని మెయింటెయిన్ చేసేందుకు ప్రభాస్.. రానాలు తెగ కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రభాస్ కు గాయాలు అయ్యాయట. దీంతో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే రుద్రమదేవి మూవీ చేశా అంటున్నాడు రానా.
‘అప్పటికే పెద్ద యుద్ధం చేస్తున్నాను.. మరో చిన్న యుద్ధం చేస్తే ఏమవుతుంది అనుకున్నా. అప్పటికే పొడుగు జుట్టు పెంచి ఉండడంతో.. దీనికి కూడా పనికొచ్చింది. బేబీ సినిమా కూడా అలాగే చేశా’ అన్నాడు రానా. నిజానికి ప్రభాస్ కంటే ముందే రానాకు కూడా గాయాలయ్యాయ్ కానీ.. రానాకు తగిలిన దెబ్బలు చిన్నవే. అందుకే సింపుల్ రోల్స్ ను కంప్లీట్ చేసేయగలిగాడు.