ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ రేంజ్ మారుతోంది. కాదు కాదు మారింది. అవును ఎందుకంటే ‘బాహుబలి’ ముందు ప్రభాస్ వేరు, ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వేరు. అందుకే ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు దేశంలోనే డార్లింగ్ ప్రభాస్ అత్యంత క్రేజీ హీరో అయ్యాడు. అతడు నటించిన సినిమా వస్తోంది అంటే ఇరుగు పొరుగు మార్కెట్లు క్యూకట్టే పరిస్థితి ఉంది. మరి ఆ రేంజ్ కి ఎదిగేశాడు డార్లింగ్. అయితే ప్రభాస్ నటించిన ‘బాహుబలి-2’ ఏప్రిల్ 28న రిలీజవబోతోంది.
ఈలోగానే సుజిత్ దర్శకత్వంలో సినిమాలో నటించనన్నాడు ప్రభాస్. ఓవైపు ఈ సినిమా చేస్తుండగానే, తదుపరి సినిమా కోసం అతన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు వెంబడిస్తున్నాయి. అందులో మైత్రి మూవీస్ పేరు వినిపిస్తోంది. మహేష్‌తో ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్బస్టర్లు తెరకెక్కించిన ఈ నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇదివరకే డార్లింగ్ ప్రభాస్‌ని కలిసి అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రయత్నించిందిట. కానీ ప్రభాస్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడని తెలిసింది.
అడ్వాన్స్ తీసుకోకుండా భవిష్యత్‌లో కలిసి సినిమా చేద్దామని తిప్పి పంపాడట ప్రభాస్. అయితే డార్లింగ్ అలా ఎందుకు చేశాడు? అడ్వాన్స్ ఎందుకు వద్దన్నట్టు? అన్నప్రశ్న అభిమానుల్లో మొదలైంది. అయితే ప్రభాస్ ఇలా అడ్వాన్స్ తీసుకోకపోవడానికి కారణం ఉందట. తన స్నేహితులు, బంధువులు అయిన ప్రమోద్, వంశీ సొంతంగా యు.వి.క్రియేషన్స్ పతాకంపై సినిమాలు తీస్తున్నారు.
ప్రభాస్ కాల్షీట్లు ఇవ్వాలే కానీ క్రేజీ సినిమాలు క్యూ కట్టినట్టే. ఈ బ్యానర్లో వరుసగా సినిమాలు చేసేందుకే పొరుగు బ్యానర్ల జోలికి ప్రభాస్ వెళ్లడం లేదని తెలిసింది. ఏదేమైనా పెద్ద బ్యానర్లు వచ్చినప్పుడు అడ్వాన్సులు అందుకుని అకౌంట్లో ఏసుకునే పద్ధతికి డార్లింగ్ దూరం అన్నమాట. మరి ఇలాగే ఎప్పటివరకు కొనసాగుతాడు? మళ్ళీ మధ్యలో తన ఆలోచన మార్చుకుంటాడా? చూడాలి మరి.