శతమానంభవతి హిట్ తర్వాత శర్వానంద్ నటిస్తున్న చిత్రం మహానుభావుడు. భలే భేలే మగాడివోయ్ ఫేం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తుండగా శర్వానంద్ సరసన కృష్ణగాడి వీర ప్రేమకథ భామ మెహరీన్ హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ పూర్తికావొచ్చిన నేపథ్యంలో సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ని పెద్ద ఎత్తున జరపడానికి నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభాస్ ను ఆహ్వానించారని సమాచారం. ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారితో ప్రభాస్ కి ఎంతో సాన్నిహిత్యం ఉంది. అందువల్ల ఈ వేడుకకి హాజరు కావడం ఖాయమేనని చెప్పొచ్చు. గతంలో శర్వానంద్ రన్ రాజా రాన్ ఆడియోకి కూడా ప్రభాస్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్‌కాగా ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఎప్పుడు? .. ఎక్కడ? అనే వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. దసరాకి ఎన్టీఆర్ .. మహేశ్ బాబు సినిమాలతో పోటీపడుతోన్న శర్వానంద్ కి శతమానం భవతిలాంటి హిట్ సొంతమవుతుందో లేదో చూడాలి.
ఇటీవల వినాయకచవితి సందర్భంగా విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. నా పేరు ఆనంద్. నాకు ఓసీడీ ఉంది. అంటే అదేదో బీటెక్, డిగ్రీలాంటిది కాదు. డిజార్డర్. దీని లక్షణాలు అతిశుభ్రం అని శర్వా చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. నువ్వు మహానుభావుడవేరా.. అన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.