పీపీపీ (PPP) విధానం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద స్కామ్ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీలు, దాదాపు పూర్తయ్యే దశలో ఉన్న కాలేజీలు, అలాగే సగం వరకు నిర్మాణం జరిగిన మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఇవ్వడమే కాకుండా, ఆ మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వమే జీతాలు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీని నడిపేందుకు సంవత్సరానికి సుమారు రూ.60 కోట్ల వరకు ఖర్చు అవుతుందని జగన్ వివరించారు. ప్రజల పన్ను డబ్బుతో నిర్మించిన విద్యా సంస్థలను కార్పొరేట్ చేతుల్లో పెట్టడం ప్రజల పట్ల మోసమేనని ఆయన విమర్శించారు. ఈ విధానంతో ప్రభుత్వ రంగ వైద్య విద్య పూర్తిగా నిర్వీర్యమవుతుందని హెచ్చరించారు.
అదే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జగన్ ఆరోపించారు. రాయలసీమ ప్రాంతానికి నీటి భద్రత కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి, రాజకీయ లబ్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ నిర్ణయాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని, భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జగన్ స్పష్టం చేశారు. పీపీపీ విధానం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read:‘జన నాయగన్’ విడుదల వాయిదా

