కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాలమరణంతో సినీ లోకం శోకసంద్రమైంది. పునీత్ ఈరోజు ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా సడన్‌గా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. అభిమాన హీరో మరణ వార్త విన్న అభిమానులు దుఖంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్‌ను కడసారి చూసుకునేందుకు అభిమానులంతా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ పలువురు సినీ సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక పునీత్ ఆకస్మిక మృతిపట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, మహేష్ బాబు,మంచు విష్ణు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, జూ.ఎన్టీఆర్, నితిన్, రాంగోపాల్ వర్మతోపాటు పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా సంతాపాన్ని ప్రకటించారు.
మరణానికి పక్షపాతం లేదు..అది ఎవరినైనా తన ఇష్టానుసారం చంపుతుంది..అంటూ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ట్వీట్ చేశాడు వర్మ . షాకింగ్ ట్రాజెడీ.. ‘ఆకస్మిక మరణం ఏంటంటే, మనలో ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజం. మనం జీవించి ఉండగానే..చేతులు ముడుచుకుని ఉండకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమ’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు వర్మ.
రాజ్‌కుమార్ కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం విని ఆశ్చర్యపోయినట్టు నటుడు మోహన్ బాబు అన్నారు పునీత్ మృతి కన్నడ పరిశ్రమకే కాదు యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు. ఆ భగవంతుడు కన్నడ ప్రజలు, సినీ పరిశ్రమకు, మా లాంటి ఆత్మీయులకు తీరని లోటు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యా. నేను కలుసుకున్న, మాట్లాడిన అత్యంత వినయపూర్వక స్వభావం కలిగిన వ్యక్తులలో పునీత్ రాజ్‌కుమార్ ఒకరు. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.
పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని చిరంజీవి అన్నారు. పునీత్ మరణ వార్తతో తీవ్ర వేదనతో హృదయం ముక్కలైంది. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కన్నడ చిత్ర పరిశ్రమే కాకుండా, యావత్ భారత చిత్ర పరిశ్రమకు పునీత్ మరణం పెద్ద లోటు. పునీత్ కుటుంబానికి, బంధుమిత్రులకు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నట్టు ట్విటర్ లో ఓ సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు.