దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు వెల్లడించారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి శవపరీక్ష పూర్తి చేశారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పులివెందుల నివాసానికి వివేకా మృతదేహాన్ని తరలించారు.
వివేకానంద రెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలోని తన నివాసంలో రక్తపు మడుగులో పడి ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఆయన శరీరం మీద ఏడు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. పదునైన ఆయుధంతో తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేశారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తొడ భాగంలో గాయం, చేతిపైన మరో గాయం, తల వెనుక భాగంలో మరో గాయం గుర్తించారు. ఈ కేసులో మాకు కొన్ని ఆధారాలు దొరికాయని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చెప్పారు. లభించిన ఆధారాలతో విచారణ చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు, వివేకా మరణం హత్యగా తేలడం సంచలనంగా మారింది. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? దీనిలో కుట్ర కోణాలేంటనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చాల సౌమ్యునిగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది.