స్టొరీ రైటర్, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్నాడు. రైటర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన పోసాని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని సినీ ఇండస్ట్రీ విశాఖ తరలివెళ్తుందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఒకవేళ ఇండస్ట్రీ విశాఖకు తరలివెళ్తే అంతా రోడ్డున పడతారని హెచ్చరించారు.
ఇండస్ట్రీ తరలివెళ్లిన తాను మాత్రం వెళ్లనని తెలంగాణలోనే ఉంటానని తెలిపారు. తెలంగాణ బాగా నచ్చిందని సీఎం కేసీఆర్ అద్బుతంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇక్కడే ఇళ్లు కట్టుకుని తెలంగాణ సినిమాలే తీస్తానని చెప్పారు. ఆంధ్రాలో వంద కోట్లు ఫ్రీగా ఇస్తానన్న వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
డ్రగ్స్ ఇష్యూకు తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు మందు మాత్రమే తాగే అలవాటు ఉండేదని ఇప్పుడు అదికూడా మానేశానని చెప్పాడు. ఇండస్ట్రీలో డ్రగ్స్ అంశంపై మాజీ మా అధ్యక్షుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉండే ఉంటుందని కొంతమంది డ్రగ్స్ తీసుకోవడంతో పాటు సరఫరా చేస్తుండటం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందన్నారు.
తనకు అవకాశాలు తగ్గినప్పుడు మళ్లీ రచయితగా మారుతానని స్పష్టం చేశారు. తాను చేస్తున్న బతుకుజట్కా బండి కార్యక్రమం గురించి మాట్లాడిన పోసాని ఆ కార్యక్రమం వ్యాపార ప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమం కాదన్నారు.
ఏపీలో రానున్న ఎన్నికల్లో బలమైన శక్తులుగా చంద్రబాబు, జగన్, పవన్ ఉన్నారని మీరు ఎవరికి ఓటు వేస్తారని ఓ యాంకర్ ప్రశ్నించగా.. నా ఓటు జగన్‌కే అంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు జగన్ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహిస్తాననని కుండబద్దలు కొట్టేశాడు.