గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూత..

81
- Advertisement -

ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్‌ (92) మృతి చెందారు. ఈరోజు ఉదయం 8:12 గంటలకు లతామంగేష్కర్ తుదిశ్వాస విడిచారు. కరోనా తగ్గిన అనంతరం ఆసుపత్రిలో చేరిన 28 రోజుల తర్వాత పలు అవయవాల వైఫల్యం కారణంగా ఆమె మరణించింది. ల‌తా మంగేష్క‌ర్‌కు క‌రోనా సోకడంతో ఆమెను దాదాపు నెల రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుప‌త్రిలో చేర్చిన విష‌యం తెలిసిందే. న్యూమోనియాతోనూ ఆమె బాధ‌ప‌డ్డారు.

ఆమెకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందించారు. వ‌య‌సు రీత్యా మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చేరి, కోలుకున్న విష‌యం తెలిసిందే.

1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో లతా మంగేష్కర్ జన్మించారు. దీనానాథ్ మంగేష్కర్​, శుద్దమతిల తల్లిదండ్రులు. మహల్(1949) సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా మంగేష్కర్ కెరీర్ మలుపు తిరిగింది. 1948-78 మధ్య 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్​ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. మొత్తం 980 చిత్రాలకు గాత్రాన్ని అందించారు లతా మంగేష్కర్. ఆమె 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. లతా మంగేష్కర్ కు 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న పురస్కారాలు ఇచ్చారు.

- Advertisement -