సినీరంగంలో మరో తీరని విషాదం నెలకొంది. ఎంతో కష్టపడి ఓ ప్రముఖ స్థాయికి చేరుకున్న డాన్స్ మాస్టర్ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకుని తన తోటివారికి, స్నేహితులకు దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు. బాలీవుడ్ లో ప్రముఖ హీరోలైన సల్మాన్ ఖాన్ ,రణవీర్ సింగ్ ,రణబీర్ కపూర్ లకు కొరియోగ్రఫీ చేసిన పాపులర్ డాన్స్ మాస్టర్ అభిజిత్ షిండే ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం మధ్యాహ్నం ఎవ్వరూ లేని సమయం చూసి ముంబై లోని తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవంతంగా తన ఊపిరిని అనంతవాయువుల్లోకి జారవిడిచారు. స్థానికులు విషయం గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన గదిలో దొరికిన సూసైడ్ నోట్ ప్రకారం తను మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు అభిజిత్ పేర్కొన్నారు. తన పేరున ఉన్న బ్యాంకు అకౌంట్ ను తన కూతురి పేరుకు ట్రాన్స్ ఫర్ చేయమని అభిజిత్ విన్నవించారు .ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఆయన భార్య ఆవేదనతో కన్నీరుమున్నీరైంది.
కొంతకాలంగా అభిజిత్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ..మనోవేదనకు గురై డిప్రెషన్ తో బాధపడుతున్నారని ఆమె తెలిపింది. కేసు నమోదు చేసి,దర్యాప్తు జరిపిస్తున్న పోలీసు ఉన్నతాధికారి రమేష్ ఖడే…. అభిజిత్ తన భార్యతో ఏర్పడిన వివాదాల వల్ల మనస్థాపం చెందాడనీ , ఆయన భార్య మూడు నెలలుగా తన కూతురుని చూసేందుకు అభిజిత్ ని నిరాకరించిందనీ ,ఆ మనోవేధనతోనే అభిజిత్ ఆత్మహత్య కు పాల్పడ్డాడని ఖడే వివరించారు. పోస్ట్ మార్టం అనంతరం అభిజిత్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తామని ఖడే తెలిపారు .