తిరుపతిలో సంచలనానికి దారితీసిన ఘటన చోటుచేసుకుంది. మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టేందుకు బయలుదేరిన విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వినోద్ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా, తిరుచానూరు వద్ద సుమారు 30 మంది దుండగులు వాహనాల్లో వచ్చి వారిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై, నిందితుల వాహనాలను వెంబడించారు. కొద్దిసేపటి తర్వాత బాధితులను సురక్షితంగా విడిపించడంతో పాటు, ఘటనకు సంబంధించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read:KTR:కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి
బాధితుల ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీష్‌ను ఏ–1గా, మంచు మోహన్‌బాబును ఏ–2గా, మంచు విష్ణును ఏ–3గా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అందరి పాత్రను లోతుగా పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసు తిరుపతిలో రాజకీయ, విద్యార్థి వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

