మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఓ వివాదాస్పద ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని బొమ్మసానిపల్లి రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన ఆయన ప్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వైఎస్ జగన్ అభిమానులమని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఈ రక్తాభిషేకాన్ని నిర్వహించినట్లు సమాచారం. ప్లెక్సీకి కోడి రక్తాన్ని పోసి, ఆ వీడియోకు సినిమా పాటను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రజా స్థలాల్లో అనుచిత ప్రవర్తనకు, చట్ట విరుద్ధ చర్యలకు ఉదాహరణగా మారిందని పోలీసులు భావిస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో తప్పు సందేశం వెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన తిరుపతి పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం, సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేయడం వంటి అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

