తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయి, బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి, బాన్సువాడ శాసనసభ్యులు పొచారం శ్రీనివాస రెడ్డి. స్పీకర్ స్థానానికి పొచారం నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, TPCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్, అహ్మద్ బలాలా తదితరులు పోచారంను కుర్చీ వరకు తోడ్కొని వెళ్ళగా, పోచారం శ్రీనివాసరెడ్డి ప్రొటెం స్పీకర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.
పోచారం శ్రీనివాసరెడ్డికి అభినందనలు…
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన రోజులను నా జీవితంలో మరచిపోలేను. తమరు కాలు మోపిన గడియలు మంచివి, రాష్ట్ర రైతులకు మంచి జరిగింది. రైతుబంధు పథకంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు కురిపించింది. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. నా ఇష్టపూర్వకంగా లక్ష్మీ పుత్రుడు అని ఆప్యాయంగా పిలుచుకున్నాను. మీది పరిపూర్ణ జీవితం. నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో వివాదరహితంగా ఉన్నారు. 1969 ఉద్యమంలో లాఠి దెబ్బలు తిని చదవుకు స్వస్థి పలికారు. 2011లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా MLA పదవికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలలో అఖండ మెజారిటీతో విజయం సాదించారు. తమ కీర్తి కిరీటంలో స్పీకర్ కలికితురాయి.
గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి) మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కొరకు రాజీనామా చేశారు. రైతు బిడ్డగా రైతుల సమస్యలు తెలిసిన మీరు గతంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన తీరు ఆదర్శం. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో సామాన్య కార్యకర్తగా పనిచేశారు. ఎదిగిన కొద్ది ఎదిగి ఉండే మీ మనస్వత్వం గొప్పది. రాష్ట్ర హోంమంత్రి మొహమద్ అలీ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలోనే గౌరవం అందుకున్నారు. మీ పనితీరుతో వ్యవసాయ రంగం అద్భుతమైన ప్రగతి సాదించింది.
ఈటెల రాజేందర్ (హుజురాబాద్) మాట్లాడుతూ.. శాసనసభా పతిగా రైతు బిడ్డ ఎన్నిక కావడం గొప్ప గౌరవం. రైతుల సమస్యలపై SLBC సమావేశంలో ముక్కు సూటిగా మాట్లాడేవారు బాన్సువాడ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ప్రజల జీవితాలతో ఏ విదంగా పెనవేసుకున్నారో అర్ధమైంది. తెలంగాణ మత్స్యకారులు జీవితంలో వెలుగు తేవడానికి ప్రయత్నం చేశారు.
టి.హరీష్ రావు (సిద్దిపేట) మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ఉద్యమం, మలి ఉద్యమంలో పాల్గొని శాసనసభ్యుడుగా ఎన్నికయి తిరిగి సభాపతిగా ఎన్నికకావడం తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవం. డి. శ్రీదర్ బాబు (మంథని) మాట్లాడుతూ.. మీ వస్ర్తాధరణ, నడక రైతును ప్రతిబింబిస్తారు అన్నారు.
ఇంకా శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు MIM నుండి అహ్మద్ బిన్ అబ్ధుల్ బిలాలా, శ్రీమతి పద్మా దేవెందర్ రెడ్డి (మెదక్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్), వేముల ప్రశాంత్ రెడ్డి (బాల్కొండ), నోములు నర్సింహయ్య (నాగార్జున సాగర్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), గాదరి కిశోర్ కుమార్ (తుంగతూర్తి), బిగాల గణేష్ గుప్త (నిజామాబాద్ అర్బన్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), గంప గోవర్ధన్ (కామారెడ్డి), హన్మంత్ షిండే (జుక్కల్), ఎర్రబెల్లి దయాకరరావు (పాలకుర్తి), రెడ్యానాయక్( డోర్నకల్), ఎ. ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్ రూరల్), ఎ. జీవన్ రెడ్డి (ఆర్మూర్). ఈ సందర్భంగా శాసనసభ్యులు పోచారంతో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సభ గౌరవాన్ని పెంపోందించడానికి అందరం కలిసి పనిచేయాలని సూచించారు.