ఆర్థిక నేరగాడు,భారత బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టులో హాజరుపర్చిన పోలీసులు అతడిని ఇండియాకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేశారు.
భారత్ నుండి పారిపోయిన రెండు సంవత్సరాల తర్వాత లండన్ వీధుల్లో నీరవ్ ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో వెస్ట్ మిన్‌స్టర్ కోర్టు అతడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ స్కాంలో మరో నిందితుడైన నీరవ్ మేనమామ మెహుల్ చోక్సీ కూడా దేశం వదిలి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్న చోక్సీ కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నాడు.
నీరవ్ మోడీ భారత బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు.2018 జులైలో నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు నీరవ్‌కు చెందిన ఫాం హౌజ్,సోలార్ పవర్ ప్లాంట్,అహ్మద్ నగర్లో ఉన్న 135 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది టెలిగ్రాఫ్ జర్నలిస్ట్ నీరవ్‌ను గుర్తించి ప్రశ్నలడుగగా తప్పించుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు నీరవ్. లండన్‌లో కూడా నీరవ్ వజ్రా వ్యాపారం చేస్తుండటం విశేషం.