అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మైత్రీ బంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం పలుకుతున్నామని మోదీ అన్నారు.
ఇరు దేశాల మైత్రీ బంధం కలకాలం వర్థిల్లాలని చెప్పారు. ఈ నేల గుజరాత్‌ది. కానీ జోష్ మాత్రం ఇండియాదన్నారు. ఈ ఉత్సాహాం ఆకాశం అంతా దద్దరిల్లుతోందన్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి స్టేడియం వరకు.. భారతీయ సాంప్రదాయ నృత్యాలు మారుమోగాయన్నారు. మొతేరా స్టేడియంలో కొత్త చరిత్ర ఆరంభమైందన్నారు. చరిత్ర రిపీటైందని మోదీ అన్నారు.
అయిదు నెలల క్రితం అమెరికాలో హౌడీ మోదీ టూర్ చేశానని, ఇప్పుడు నా స్నేహితుడు ట్రంప్.. నమస్తే ట్రంప్ ఈవెంట్‌లో భాగంగా ఇండియా వచ్చారన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం మిమ్ముల్ని స్వాగతిస్తోందన్నారు. నమస్తే అనే పదం భారతీయ మూలాలకు చెందినదని, ఇది సంస్కృత భాషకు చెందిన పదమని, ఆ పదంతో మనిషిని గౌరవించడమే కాదు, ఆ మనిషిలోని ఔనత్యాన్ని కూడా చూస్తామన్నారు. ఇండియా, అమెరికా బంధం.. కేవలం ఓ భాగస్వామ్యమే కాదు అని, ఇది మరింత సన్నితమైన స్నేహంగా మారిందన్నారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందని, ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందన్నారు.