భారతీయుల దృఢసంకల్పానికి ఇది ప్రతీక-ప్రధాని మోదీ

353
Modi
- Advertisement -

చంద్రునిపై పరిశోదనలో భాగంగా భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌–2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ట్రాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 నింగికెగసిన క్షణాలు ప్రతిభారతీయుడికి గర్వకారణం అని పేర్కొన్నారు. దేశీయంగా ఇంతటి బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసిన భారత శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు శుభాభినందనలు అంటూ కోవింద్ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. భారత్ చంద్రయాన్-2 ప్రయోగం గురించి గర్వంగా చెప్పుకోవడానికి కారణం అందులో ఉపయోగించిన సాంకేతికత అంతా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిందే. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇప్పుడు దాని గురించే ప్రస్తావించారు. సర్వం భారతీయం అంటూ ట్వీట్ చేశారు. భారత సత్తా, భారత స్ఫూర్తి అంటూ ట్వీట్ మొదలుపెట్టిన మోదీ, ప్రతి ఒక్కరూ ఉప్పొంగిపోతున్నారంటూ అందుకు కారణం చంద్రయాన్-2 పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారుకావడమేనని ఉద్ఘాటించారు.

దీంట్లో చంద్రుడి అణువణువును పరిశోధించేందుకు ఆర్బిటర్ ఉందని, చంద్రుడి ఉపరితలాన్ని నిశితంగా విశ్లేషించేందుకు ల్యాండర్ రోవర్ మాడ్యూల్ ఉందని ప్రధాని వివరించారు. భారత శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలకు చంద్రయాన్-2 ప్రాజక్టు ఓ గీటురాయిలా నిలుస్తుందని, శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ద్వారాలు తెరిచేక్రమంలో 130 కోట్ల మంది భారతీయుల దృఢసంకల్పానికి ఇది ప్రతీక అని మోదీ కొనియాడారు. చంద్రయాన్-2 ప్రయోగం యువమేధావులను సైన్స్, అత్యున్నత పరిశోధనలు, ఆవిష్కరణల రంగం దిశగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -