జపాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోబెలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. నోట్ల రద్దుపై మాట్లాడుతూ ఆయన నల్లధనం వెల్లడించేందుకు కేంద్రం గతంలో పథకం ప్రకటించిందని, ఆ తర్వాతే పెద్ద నోట్లు రద్దు చేశామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 30 తర్వాత కూడా బ్లాక్ మనీ బయటపెట్టని నల్లధనవంతుల పనిపడతామని, సంబంధిత శాఖాధికారుల దాడులు తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా హెచ్చరించారు.
నోట్ల రద్దును స్వాగతిస్తున్న వారందరికీ శాల్యూట్ చేస్తున్నానని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు రూ. 45 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని చెప్పారు. 30 డిసెంబర్ తర్వాత బయటపెట్టని నల్లధనంపై దాడులు తప్పవని, 1947 ఆగస్ట్ 15నుంచి ఉన్న ఆదాయ వివరాలు కూడా బయటకు తీయిస్తానని నల్లకుబేరులను మోడీ హెచ్చరించారు. ఇందుకోసం అవసరం అయితే ఎంతమంది అధికారులనైనా రంగంలోకి దించుతానని మోడీ స్పష్టం చేశారు. గంగానదిలో పుణ్యం కోసం కూడా ఏ రోజూ రూపాయి వేయనివారు… ఇప్పుడు వెయ్యి, 500 రూపాయల నోట్లను గంగలో విసిరేస్తున్నారని అన్నారు. పెద్ద నోట్ల మార్పిడి అంశంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిసెంబర్ 30 వరకు నోట్లను మార్చుకోవచ్చు అని మోడీ తెలిపారు.
కాగా, ప్రధాని మోడీ మూడు రోజుల జపాన్ పర్యటన శనివారంతో ముగిసింది. జపాన్‌లోని ఒసాకా నగరం నుంచి మోడీ దిల్లీ తిరుగు పయనమయ్యారు.
* గురువారం జపాన్ చేరుకున్న మోడీ భారత్-జపాన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు, శుక్రవారం ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబేని కలిశారు.
* పర్యటనలో భాగంగా చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంతో పాటు ఇరు దేశాల మధ్య 10 కీలక ఒప్పందాలు జరిగాయి.
* కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) నిర్వహించిన భారత్-జపాన్ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్నారు.
* శనివారం ఆ దేశ ప్రధాని అబేతో కలిసి ప్రఖ్యాత హైస్పీడ్ బుల్లెట్ రైలు షింకన్‌సేన్‌లో టోక్యో నుంచి కోబ్ వరకు ప్రయాణించారు. కవసాకి హెవీ ఇండస్ట్రీస్ ప్లాంట్‌ను సందర్శించారు.
* అనంతరం టోక్యో, కోబె నగరాల్లో ఉన్న భారతీయులతో మాట్లాడారు. రెండు సంవత్సరాల్లో మోడీ జపాన్‌లో పర్యటించడం ఇది రెండోసారి