కరోనా,లాక్‌డౌన్ తాజా పరిస్థితులపై నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ కాన్ఫరెన్స్ మూడు గంటలపాటు కొనసాగింది. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంతోపాటు లాక్‌డౌన్ సడలింపులపై ఎలా ముందుకు వెళ్లాలి? లాక్‌డౌన్‌ను పొడిగించాలా? లేక దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? తదితర విషయాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించారు.
అయితే ప్రధాని మోదీ ఈ కాన్ఫరెన్స్‌లో కేవలం తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకే మాట్లాడే అవకాశం కల్పించినట్లు సమాచారం. 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో నలుగురు మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధానికి సూచించినట్లు తెలిసింది.. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్ కొనసాగించాలని, గ్రీన్‌జోన్లలో పూర్తి సడలింపు ఇవ్వాలని కొంతమంది సీఎంలు కోరారు. ఈ సందర్భంగా మోదీ కీలక విషయాలు ప్రస్తావించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని చెప్పారు. దేశంలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. ‘మనదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చింతించాల్సిన అవసరం లేదు.
లాక్‌డౌన్‌ను ఎత్తి వేసే విషయంపై ప్రణాళికలు వేసుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో లాక్‌డౌన్ క్రమంగా ఎలా ఎత్తివేయాలన్న అంశాలపై ఆలోచించాలన్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక దూరం, మాస్కుల వినియోగం నిబంధనలను పాటిస్తూ వాణిజ్య కార్యకలాపాలు జరపాలని చెప్పారు.కేంద్రం నుంచి ఆర్థిక ప్యాకేజీ అందాలని రాష్ట్రాలు కోరాయి. విద్యా సంస్థలు, రవాణా, ప్రార్థనాలయాలు వంటి వాటిపై ఆంక్షలను మాత్రం కొనించాల్సిందేనని సమావేశంలో అందరూ అభిప్రాయపడ్డారు.