2019 సార్వత్రిక ఎన్నికలపై ప్రత్యేకదృష్టి సారించింది బీజేపీ. ఓ వైపు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు గెలుపు గుర్రాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మోడీ పోటీ చేసే స్ధానాన్ని మార్చాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మోడీని పూరి లోక్‌సభ నుండి బరిలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఒడిశా బీజేపీ నేత బసంత్ పాండా తెలిపారు.
ఈ ప్రతిపాదనను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ముందు పెడతామని వెల్లడించారు. అయితే దీనిపై బీజేపీ అగ్రనాయకత్వందే తుదినిర్ణయం అన్నారు. మోడీ పూరి నుండి బరిలోకి దిగితే బెంగాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి మంచి సానుకూలత వస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గోలాక్ మొహాపాత్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
పూరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే ఉండగా..మిగిలిన ఆరు స్థానాల్లో బీజేడీ అభ్యర్థులు గెలిచారు. 2014 లోక్ సభ ఎన్నికలలో పూరిలో బీజేపీ మూడవ స్థానంలో ఉన్నప్పటికీ..బీజేపీ అభ్యర్థి అశోక్ సాహు రెండు లక్షలకుపైగా ఓట్లను దక్కించుకోవటం విశేషం.