ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మునుపటితో పోల్చితే కరోనా వ్యాప్తి నిదానిస్తుండడంతో అనేక రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియకు తెరదీశాయి. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయన్నది ఆయన వివరించే అవకాశాలున్నాయి.కాగా, దేశంలో గడచిన 24 గంటల్లో కేవలం లక్ష కేసులే నమోదు కావడం కొన్ని వారాల అనంతరం ఎంతో ఊరట కలిగించే విషయం. గత 61 రోజుల తర్వాత కరోనా రోజువారీ కేసుల్లో ఇదే కనిష్ఠం.
మరోవైపు తమ ప్రభుత్వ వ్యాక్సినేషన్ పాలసీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మోదీ దానిపై కూడా మాట్లాడతారని సమాచారం. సుప్రీంకోర్టు కూడా వ్యాక్సిన్ పాలసీపై ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. దాని కోసం బడ్జెట్‌లో కేటాయించిన 35 వేల కోట్లు ఏమయ్యాయని కూడా ప్రశ్నించింది. వీటిపై ప్రధాని తన ప్రసంగంలో వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.